హథ్రాస్
-వసీరా
సూర్యుడి తేజాన్ని మట్టిబలాన్ని
చెమటలోని ప్రేమని తాగి పెరిగిన
గోధుమ గింజ రక్త సిక్తమైంది
చిన్నారి గోధుమ గింజ రక్తకన్నీరుతో తడిసి
నేలలోకి వెళ్లపోయింది.
నేల లోపల అణుప్రకంపనలు
గంగాతీర మైదానాలు కంపిస్తున్నాయ్
కంకుల్లోని గింజలు నిప్పుల పాలుపోసుకుని గ్రెనేడ్లవుతున్నాయి
కంకులు బులెట్లని కాస్తున్నాయి
తరతరాలుగా నీదయిన నీ నేల
రణరంగమవ్వడానికి సిద్ధమవుతోంది.
విస్ఫోటించే నేల లోంచి కొత్త కాళిక ఆవిర్భవిస్తోంది.
సత్యానికి నోరిచ్చేందుకు సహస్రబాహువుల్లో
కొత్త ఆయుధాలు ధరించి
పరపరా సరసరా నాలుకలు కోస్తోంది
కోసిన నాలికలు మొల చుట్టూ అలంకరించుకుంది.
ఏమీ లేదన్న వ్యవస్థలనుంచి
పార్లమెంటు నుంచి, అసెంబ్లీల నుంచి
అసత్య వ్యవస్థల నుంచి వికృతంగా
చొంగ కారుస్తూ వాగే,
వేలాడే పురుషాంగాలను కోసేస్తోంది.
అచ్చంగా పరపరా కలుపు మొక్కలు కోసినట్లుగా
పురుషాంగాలు కోసి మొలచుట్టూ అలంకరించుకుంటోంది.
విషపు చూపులు చూసే కనుగుడ్లు పెరికి
మెడచుట్టూ దండలుగా అలంకరించుకుంది.
వ్యక్తుల్నీ వ్యవస్థల్నీ మృగత్వం నుండి
మానవత్వంలోకి నడిచే దారిచూపిస్తోంది.
మట్టిలోంచి విస్ఫోటిస్తూ చిట్టితల్లి బయటికొస్తోంది.
చిట్టితల్లి కోసం వస్తున్నారు
అడవుల్లోంచి ఆదివాసి అక్కలు
అడవి కాడమల్లి వృక్షాలలోంచి
గురిచూసి పాడే పాటల్ని తీసుకుని
జమ్మిచెట్టు మీంచి దించిన ఆయుధాల కిట్లతో
తరతరాలుగా నీవు నిన్ను గన్న
ఏ భూమికి పరాయివి అయ్యావో
ఆ భూమి మీదే నిటారుగా నిలబడి
ఈ నేల నాది నాది నాది నాదంటూ
నువ్వో పోరాట జెండాని పాతే చారిత్రక సందర్భం కోసం
అమరులైన నీ పూర్వీకులు ఆకాశంలోంచి చూస్తున్నారు
నీ నేలనీ, నీ ఆత్మగౌరవాన్నీ నీ నూతన రాజ్యాన్నీ
దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటిస్తూ
నువ్వే దానికి కాపలా కాసే సైన్యానివి అవుతావు.
అసత్యం అణిచివేత తరతరాల దగాలపై అంతిమ తీర్పు అమలు చేస్తావు
కరకరా ఫెళపెళా కరకరా పెళఫెళా
భూమ్యాకాశాలు దద్దరిల్లే శబ్దంతో
చెవులకు విందుగా
నువ్వీ కొత్త నియంతల వెన్ను విరిచే చప్పుడు
నువ్వీ కొత్త నియంతల వెన్ను విరిచే చప్పుడు
భయంకర శబ్దంలో నియంతల ఆర్తనాదాలు
అమ్మా మనం హిట్లరుకే వెన్ను విరిచాం
మనం వెన్ను విరిచి హిట్లరునే మన్నుకలిపాం
*****