అనుసృజన

నిర్మల

(భాగం-10)

అనుసృజన:ఆర్. శాంతసుందరి 

హిందీ మూలం: ప్రేమ్ చంద్

చెల్లెలు కృష్ణ పెళ్ళికి ఇంకా ఒక నెలరోజులుందనగా ఇంట్లో ఎన్ని బాధ్యతలున్నా నిర్మల ఆగలేకపోయింది.పుట్టింటికి ప్రయాణమైంది.తోతారామ్ వెంట వస్తానన్నాడు కానీ అల్లుడు అత్తారింట్లో అన్నాళ్ళు ఉండిపోవటం మర్యాద కాదనీ, పెళ్ళికి రెండ్రోజులు ముందు రమ్మనీ నిర్మల ఆయన్ని వారించింది.

నిర్మలతో సంబంధం అక్కర్లేదని అన్న అదే కుటుంబంలో రెండో కొడుకుతో కృష్ణ పెళ్ళి నిశ్చయమవటం అన్నిటికన్నా ఆశ్చర్యం.అప్పటికన్నా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇంకా అధ్వాన్నాంగా ఉంది.అయినా కానీ కట్నం అక్కర్లేదని వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారని విని నిర్మల అవాక్కయింది. ఇన్నాళ్ళూ చెల్లెలి గురించి నిర్మలకి చాలా ఆందోళనగా ఉండేది. మధ్యవయస్కుడికో, రెండో పెళ్ళివాడికో తల్లి దాన్ని కట్టబెట్టేస్తుందనీ,దాని బతుకు కూడా తనలాగే కష్టాలతో నిండిపోతుందనీ నిర్మల ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఇప్పుడీ వార్త విన్నాక ఆమె మనసు శాంతించింది.

నిర్మల తల్లి కూతురితో,” ఏమిటే ఇలా చిక్కిపోయావు? అల్లుడు బాగా సంపాదిస్తున్నాడనుకున్నానే, తిండి లేనట్టు ఇలా అయిపోయావేమిటి? ఇక్కణ్ణించి వెళ్ళేప్పుడు పువ్వులా ఉన్నావు .అందరూ పెళ్ళయాక ఒళ్ళు చేసి, చక్కగా తయారవుతారు.నువ్వేమిటే ఇలా…”అంది.

అదేం కాదమ్మా, అక్కడ నీళ్ళు నాకు పడినట్టు లేవంతే.ఎప్పుడూ ఏదో అలసటగా ఉంటుంది.”

అల్లుడు పెళ్ళికి వస్తాడుగా, అప్పుడడుగుతాను, ఇదేమిటయ్యా పువ్వులాంటి పిల్లని నీ చేతుల్లో పెడితే ఇలా అయిపోయింది , అని నిలదీస్తానుండు!”

నిర్మల ఏమీ జవాబు చెప్పలేదు.”అన్నట్టు డబ్బెందుకు పంపించావు? నిన్నెప్పుడైనా డబ్బులడిగానా? ఎంత పేదదాన్నయినా కూతురి డబ్బు తీసుకుంటానుటే?” అంది కల్యాణి.

డబ్బా? ఎవరు పంపారు? నేనేమీ పంపలేదే ? “

అబద్ధాలాడకు.ఐదువందల రూపాయల కట్ట నువ్వు పంపలేదూ?”

నువ్వు పంపించకపోతే ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? కవర్ మీద నీ పేరు స్పష్టంగా రాసి ఉంది.తపాలా ముద్ర కూడా మీ ఊరిదే,” అంది కృష్ణ.

నీ మీదొట్టు , నేను డబ్బూ పంపలేదు.”

అరే, రెండు మూడు నెలలక్రితం అందింది మొత్తం.నువ్వు కాకపోతే మరెవరు పంపుతారు?”అంది కల్యాణి.

నాకేం తెలుసు ఎవరు పంపారో? చేతికంది వచ్చే కొడుకు పోయాక ఆయన కోర్టుకెళ్ళటమే మానేశారు.నా దగ్గర ఎప్పుడూ సరిపోయేంత డబ్బుండదు.ఇక మీకెక్కడ పంపిస్తాను?” అంది నిర్మల.

నీకు తెలీకుండా మీ ఆయన పంపించలేదు కదా?”

ఆయనా డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారు.ఎలా పంపిస్తారు?”

ఇప్పుడేం చెయ్యటం? డబ్బుతో పెళ్ళి బట్టలూ నగలూ కొనేశానే?”అంది కల్యాణి.

 

*****

(ఇంకాఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.