వరద
-శ్రీధరరెడ్డి బిల్లా
జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది.
పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే ,
చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ
ఇంటి సామాను, వంట సామాను మోస్తున్నాయి!
వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది.
“వీధి మలుపు” వాగుకొక వంక అయ్యింది!
దారి చూపిస్తూ పంపించే ట్రాఫిక్ సిగ్నలు ,
దారి తెల్వకుండా ఎటువైపో తేలిపోతా ఉంది !
కాళ్ళతో టిక్కుటిక్కున నడిచిన నిన్నటి రోడ్డు మీద
కాళ్ళు నేలకు ఆనక, చేతులెత్తి అరుస్తూ కొట్టుకుపోతున్నారు !
నిన్నటిదాకా కొత్త బైకు కోసం నాన్న వెంటబడ్డ కుర్రోడు,
స్పీడు బోటు కావాలంటూ స్పీడుగా మాట మార్చాడు!
ఇంటి నుంచి చెత్త బాటిళ్లను వీధిలో పారేస్తే
వీధిని ఊడ్చి వరద,చెత్తను ఇంట్లోకి తెచ్చింది !
“పాత ఇళ్లను కూల్చాలా వద్దా?” అన్న
సంశయాన్ని వరద కూల్చి తీర్చి వేసింది !
చెరువులాక్రమించుకొని వెంచర్లు వేసి,
కుంటలన్నిటిని వదలకుండ పూడ్చివేసి,
భాగ్యనగరాన ఒకనాడు భాసిల్లిన వేలకొద్దీ
చెరువులను, కుంటలను చెరిచివేశారు!
గజం గజం భూమి కూడ బంగారమంటూ
ప్లాట్లు చేసి నగర ప్రాణులకు అమ్మి వేసారు!
పైసా పైసా కూడగట్టి బక్కప్రాణి ఇల్లు గట్టుకుంటే
చుట్టూ వరదనీరు చేరి ఇంటిని ముంచేసింది!
చెరువుభూమిని చెరబట్టి
దాని గుండె చెరువు జేసిందెవరు?
కొండభూములు కొల్లగొట్టిన
పాశాన గుండెలెవరివి ?
స్మశాన భూముల నావహించి
పిశాచ వికృత వికట్టహాసం చేసిందెవరు?
నలువైపులా విస్తరిస్తూ నాట్యమాడి
వెలిగిన నగరం ఠీవిగా నిలబడింది. నిలబడ్డాననుకుంది !
అన్నిటిని పూడ్చి పెట్టిన నగరం
తనకు తెలియకుండానే తన గోతిని తానే తవ్వుకుంది!
కాలమెవని సొత్తు?
ఒకనాడు పక్కన నిల్చి కలసివచ్చిన కాలం
మరొకనాడు ఎదురునిల్చి కలబడి తీరుతుంది !
చెరువు భూమిని వెంచర్లు వేసినపుడు,
లంచాలు మింగి దొంగ అనుమతులిచ్చిన,
కార్పొరేషను అధికారి ఇప్పుడెక్కడ కాలబడ్డాడు?
అమ్మకాల రిజిస్ట్రేషన్లతో సొమ్ము చేసుకున్న
రిజిస్ట్రారు దొరగారు ఇప్పుడెక్కడ దాగినారో?
కాసులకు కక్కుర్తిపడి ఇంటికి అనుమతిచ్చిన
మున్సిపాలిటీ వాడు ఇపుడెక్కడ మునిగినాడో ?
వెనకనుండి తంత్రం నడిపించిన రాజకీయ
నాయకుడు ఇపుడు ఏ మూల నక్కినాడో?
నీటి జాగ ఆక్రమించి కాలనీ కట్టుకుంటే,
“ఈ కాలనీయే నా జాగ” అంటూ వరదనీరు వచ్చిచేరి
తన జాగను తాను తిరిగి తీసుకొని తిష్టవేసింది!
పాపం కాలనీ వాళ్ళు, వరద నీళ్లు ఒకరినొకరు
కలబడుతూ, విలపిస్తూ, శాపనార్ధాలు పెట్టుకుంటుంటే ,
పాపాత్ములైన కబ్జాకోర్లు పగలబడి నవ్వుతున్నారు !
ఈ వరద , ఇంత వాన, మొదటిది కాదు,
చివరిది కూడా కాబోదు !
“పన్నెండేండ్లు లేకపోతే నాదే” అని ఆక్రమించటానికి
అది మనిషి జాగ కాదు. చెరువు జాగ!
ఎన్ని వందలేండ్లు చెరువులో నీళ్లు లేకున్నా,
వందలేండ్లకు సరిపడా ఒకనాడే రావొచ్చు !
ఒక్కనాడే వచ్చినా వందలేండ్లు వాడుకోవచ్చు!
నాలుగు నెలలు గడిచి మళ్ళీ ఎండాకాలమొచ్చి ,
మంచినీళ్లు మోసుకుంటూ ట్యాన్కరు రాకతప్పదు!
గుక్కెడు నీటికి కుండలతో కొట్టుకోక తప్పదు !
వచ్చిన వాననీళ్ళు ఎటు పోయే?
వరద నేర్పిన గుణపాఠం ఎటుపోయే?!
*****