ఆమెప్పటికీ…..!?
-సుధామురళి
అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది
నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి
మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ
చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి
ఆ వర్షం ఆమెకు మాత్రమే సొంతం
మనసుంది కదా తనకు
చిన్నా పెద్దా మాటలతో గాయపరుచుకునేందుకు
ఒకటో రెండో గదమాయింపుల గద్దెల్ని ఎక్కేందుకు
పొలిమేర దాటని తనను
ఊరుకాని ఊరుకు తరిమినా మిన్ను విరగనట్టు విర్రవీగేందుకు
ఎన్ని కష్టాల్ని దాపెట్టిందో కానీ ఆ పైట అంచు
సప్త సముద్రాల్లో ఒకదానికి ఎప్పుడూ పోటీ వస్తుంటుంది
ఎంత అల్లరిని మోస్తుందో కానీ ఆ గుండె
ఏ అమరశిల్పి జక్కన్నకూ తీసిపోక నిత్యం తనను తాను చెక్కుకుంటుంది
ఆమె మర్యాదల శిలువను ఎక్కినవేళ
సర్రున జారే చీర కొంగు భుజాలెక్కేసి కళ్ళెగరేస్తుంది
అప్రతిష్టల గెలుపులో తాను ఓడినవేళ
పట్టుతప్పిన కొంగే పీఠముడై తన గొంతుకు ఆసరా ఇచ్చి తల దించుకుంటుంది….
ఇప్పుడెవరు అనగలరు ఆమెను ఏకాకి అని
ఇన్ని కష్టాలు కాపలాగా ఉండగా
ఇన్ని ఒడిదుడుకులు స్నేహ హస్తాన్ని ఇవ్వగా
ఇన్ని నిరాశల జమా ఖర్చులు ఓర్పుని చక్రవడ్డీగా అడుగుతూ ఉండగా
ఇంకెక్కడ ఆమె ఏకాకి
ఇంకెలా ఆమె ఒంటరి….
*****