ఊటబాయి కన్నీరు
-డా. కొండపల్లి నీహారిణి
ఎందుకింత ఏకాంత నిశీధి గమనాలో
ఎందుకింత విషాద పవనసమూహాలో
ఎక్కడినుండో పొగబండి ఏడుపుకు వేళ్ళాడుతూ ఎందర్నో మోసుకొస్తున్నది.
పరాయీకరణను , పరాభవాలను
కూరుకొని ఎఱ్ఱటి పట్టాలపై ఇటుగా…..
ఆర్తనాదాలతో,ఆధిపత్యాలతో….
కాలం చేసే గాయాల్లో ఋతువుల్ని
ప్రాణాల చెంత జేర్చ,
అనుమానాలు చెప్పే బాధల గాధల్ని
అననుకూల భావాలకూర్చి, కళ్ళసామ్రాజ్య సింహభాగాన
సింహాసనమెక్కి , అట్లా……
అవునూ,
నీదీ నాదీ ఒక్కచూపుల పొద
నీదీ నాదీ ఒక్కమాటల సొద
కలలతీరాన కనరాని కవనం
“కార్యేషు యోగీః “, “కరణేషు దక్షః “
పనుల, ప్రతిఫలాల ఒప్పందాల అందం
ఇసుకతిన్నె అడుగుల చందమై
వెక్కిరింతల తెప్పౌతున్నది .
సంధికాల సంభాషణల వెటకార వ్రేటు
బంజరుదొడ్డి పసురమవుతున్నది.
నీలోని సుప్తచేతన జారాడు పారాడు.
నీ ఒంటి పుట్ట వ్యసనపుగుట్టు .
తీరికలేని రాత్రి ,
కాలకూటాన్ని కక్కుతుంది.
విడగొట్టలేని ఆకాశం మాటున,
కెళ్ళ గించలేని మనిషితనం చాటున ,
అరిగిన దారులవెంట నడిచే
నీ నడక ఎవరికిక్కడ కడుపునింపు .
బీరపాదువేసి, ఆనగపుకాయలను
కోద్దామంటావు .
లేగదూడను కట్టేసి , కోడిపిల్లలను
కమ్మానంటావు .
కలివిడిలేమిడి కాపురపు కా’రణ’భూతం కోయిలవునా.
ఇంటిచెట్టు నీదైతే,
కోపం కోయలేని పండేమీగాదు .
చూడు ! కొత్తనడకల ప్రపంచమిది!
సమస్త వర్గ శృంఖలాలను తెంచి,
అనురాగరసానుభూతిలో విహరించు.
ఇప్పుడైతే నేనునున్నానుగాని,
ఒక్కడివేచేసే మజిలీవెనుక నలుగురట!
మండిన ఊటబాయి కన్నీళ్ళు
నీ గుండె గోడముందు నిలబడ్డవి.
శాంతిహస్తాలు చాపు ,
శూన్యహస్తాలుగావు.
*****