చదువు తీర్చిన జీవితం — కాళ్ళకూరి శేషమ్మ

-పి.జ్యోతి

చదువు తీర్చిన జీవితం” – ఒక సామాన్య మహిళ ఆత్మకథ అనే టాగ్ లైన్ తో వచ్చిన పుస్తకం కాళ్ళకూరి శేషమ్మ గారి ఆత్మ కథ. తెలుగులో మహిళలు రాసిన అత్మకథలు చాలా తక్కువ అని మనకు తెలుసు విషయాన్ని ప్రత్యేకంగా ముందుమాట రాసిన నాగసూరి వేణుగోపాల్ గారు, వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ప్రస్తావించారు. శేషమ్మ గారికి ఇప్పుడూ 77 సంవత్సరాల వయసు. పది మంది పిల్లల మధ్య మూడవ కూతురుగా శ్రీ వైకుంఠ సత్యనారాయణమూర్తి, మాణీక్యాంబ్గ గార్లకు జన్మించిన శేషమ్మ గారు మొదటి నుండి చదువు అంటే చాలా ఇష్టంతో ఉండేవారు. తండ్రి గారి ప్రోత్సాహం కూడా వారికి లభించింది. అయితే నాటి పరిస్థితుల కారణంగా చిన్నతనంలోనే వీరి వివాహం జరిగింది. తరువాత పిల్లలు, సంసారం లలో పడినా తన చదువు పై మక్కువను వీరు ఒదులుకోలేదు. కనిపించిన ప్రతి పుస్తకాన్ని, ఇంగ్లీషు భాష పై పట్టు కోసం హిందూ పేపరును క్రమం తప్పకుండా చదువుతూ తన మేదస్సుకు పదును పెట్టుకున్నారు. అవకాశం వచ్చిన వెంటనే డిగీ పట్టాను పిల్లలు పుట్టిన తరువాత సంపాదించారు.

తరువాత తన నలుగురు పిల్లల సంరక్షణలో సమయం గడిచిపోతున్నా, వారిని చదివిస్తూ వారి ఉన్నతికి నిరంతరం తాపత్రయపడుతూ వారి చదువుకు సహకరిస్తూ తాను కూడా విద్యను అదే స్థాయిలో ఆస్వాదించేవారు. వారి నలభయ్యో సంవత్సరంలో బీ..డి చేసి వయసులో ఉద్యోగం సంపాదించి ఎందరో పిల్లలకు మార్గదర్శకురాలయ్యారు. తరగతి గదిలో వీరు ఉపయోగించిన భోధనా పద్దతులు, పిల్లలను పాఠం వైపు ఆకర్షించడానికి వీరు ఉపయోగించిన విధానం వల్ల ఒక్క ఇంగ్లీషు, సామాజిక శాస్త్రమే కాక ఎన్నో విషయాల పట్ల ఆమె వద్ద చదువుకున్న పిల్లలకు అవగాహన వచ్చేది

విద్య మనిషికి ఎంతో అవసరం అని, దాని కోసం ఇంట్లో తనకు సంబంధించిన ఇతర ఆకర్షణలను తగ్గించుకుని, నూలు బట్టలను ఆనందంగా కట్టుకుని, నూనె లేని తిండిని ఆరొగ్యం అని నమ్మి తిని, ఆడంబరాలకు దూరంగా జీవించి, కేవలం చదువు కోసం మాత్రమే ధనం ఖర్చుపెట్టుకుంటూ చాలా పొదుపుగా సంసారం చేసుకుంటూ వారు జీవించిన విధానం లో ఒక శ్రద్ద, క్రమశిక్షణ కనపడతాయి. స్త్రీ సహజమైన ఆకర్షణలను దరిచేరనివ్వకుండా కేవలం తన విద్యార్జన మాత్రమే ఆశయంగా బ్రతికిన ఒక సామాన్య స్త్రీ ఆమె. సామాన్యంగా బ్రతకడమెంత కష్టమో అర్ధం అయితే వారి సామాన్య జీవితం వెనుక ఉన్న అసామాన్య పట్టుదల, దీక్ష అర్ధం అవుతాయి.

దీక్ష కారణంగానే వీరి నలుగురు పిల్లలు ఉన్నత విద్య అబ్యసించి స్టేట్ ర్యాంకర్లు అయి వివిధ రంగాలలో రాణిస్తున్నారు. వీరు తీర్చి దిద్దిన ఎందరో విద్యార్ధులు ఎన్నో రంగాలలో పని చేస్తున్నారు. ఆత్మకథలో చదువుపై వారి నమ్మకం, ప్రేమ తో పాటు సామాన్యంగా జీవిస్తూనే తమ జీవితాలను ప్రతికూల పరిస్థితులలో కూడా కేవలం పట్టుదలతో ఎందరికో స్పూర్తిదాయకంగా జీవించిన ఒక మహిళ కనిపిస్తుంది. చదువునిషిద్దం అన్న అరోజుల్లో కట్టెల పొయ్యి వెలుగులో కుమారుని పుస్తకం నుండి అక్షరాలను చూస్తూ చదవడం నేర్చుకుని ఆత్మకథ రాసిన బెంగాలి గృహిణీ రాష్ సుందరీ దేవిఅమార్ జీబన్తన జీవితానికి ప్రేరణ అని శేషమ్మ గారు చెప్పుకున్నారు. గాంధి గారి ఆత్మకథను పదిహేను సార్లు పైగా చదువుకున్నానని వారు చెప్పినప్పుడు ఇంటి నాలుగు గోడలమధ్య ఉంటూనే జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి మనిషి విద్యను సాధనంగా ఎంచుకుని ఎలా జీవితాన్ని సార్ధకం చేసుకోగలడొ అర్ధం అవుతుంది.

విజయం అంటే కొలమానాలు ఎవరి ఆలోచనలను బట్టి వారి కుంటాయి. కొందరు డబ్బు సంపాదన విజయం అని చెబుతుంటారు. కాని ప్రతి ఒక్కరికి డబ్బే జీవితంలో విజయాన్ని తీసుకురాదు. శేషమ్మ గారు విద్యకు తప్ప మరో దానికి జీవితంలో ప్రాముఖ్యం ఇవ్వలేదు. అందుకే చదువు మాత్రమే తన విజయం అని ప్రతి క్షణం నమ్ముతూ వచ్చారు. ఇష్టంగా చదువుకుంటూ తన పిల్లలను చదివిస్తూ వారి లోని ప్రతిభను వెలికి తీస్తూ గృహిణిగా తన భాద్యతలు నిర్వహిస్తూ, మధ్య వయసులో చదువును కొనసాగిస్తూ ఉద్యోగం చేస్తూ ఆవిడ గడిపిన జీవితం చాలా మంది మహిళలు అసాధ్యం అనుకున్నదే. కాని దాన్నే సాధ్యం చేసి చూపించడానికి అప్పటి పరిస్థితులలో స్త్రీ కోణం నుండి చూస్తే అది పెద్ద సాహసమే. తమ మీద తమకు ఎంతో నమ్మకం ఉంటే తప్ప సాధ్యం కాదు విజయం సంపాదించడం. స్త్రీలలో తమ శక్తి సామర్ద్యాలపై నమ్మకం ఉన్న వారి సంఖ్య బహు స్వల్పం. ఉన్నా వాటిని ఉపయోగించుకున్న వారు అత్యల్పం. శేషమ్మ గారు వారిలో ఒకరు అవడమే వారు సాధించిన గొప్ప విజయం

ఇంగ్లీషు నేర్చుకోవడానికి స్కూలు విద్యార్ధులే కాదు, కాంపెటీటీవ్ పరిక్షలు రాయడానికి ప్రయత్నిస్తున్న వారు కూడా శేషమ్మ గారి సహాయం తీసుకునే వారంటే భాష, వ్యాకరణాల మీద వారికున్న పట్టు అర్ధం అవుతుంది. షెల్లి. థామస్ హార్డీ, థామస్ గ్రే కవిత్వం లోని వాక్యాలను ఆసువుగా కోట్ చేసే వీరు మధర్ థెరీసా పాఠాన్ని లే హంట్ అబౌ బెన్ ఆధెమ్ అన్న కవితతో మొదలెట్టీన విధానం వారిలోని ఉత్తమ అభిరుచికి, పఠనా ప్రతిభకు నిదర్శనం. అంతటి ప్రతిభను వారు స్వీయ ప్రయత్నంతో సంపాదించుకున్నారని తెలుసుకున్న తరువాత తన శక్తి పట్ల నమ్మకం ఉన్న స్త్రీ ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించగలదో అర్ధం అవుతుంది

అనుకూల పరిస్థితులలో కాదు ప్రతికూల పరిస్థితులలో విజయాలను అందిపుచ్చుకున్న వారి శక్తి సామర్ద్యాలను గౌరవించాలి. స్త్రీలు తమ విద్య పట్ల పెద్దగా శ్రద్ద పెట్టని రోజుల్లో అలంకారాలు, భాద్యతల నడుమ స్త్రీ జీవితం సాగిపోవలసిందే అని సమాజం అనుకున్న రోజుల్లోనే అటువంటి జీవితాన్నికాదని విద్యార్జనను తన జీవిత ధ్యేయంగా చేసుకున్న వీరి జీవిత కథ వారిని సామాన్య మహిళ స్థాయి నుండి దూరంగా తీసుకెళ్ళి నిలబెడుతుంది. థామస్ గ్రే కవితలో లాగ ఎడారిలో వికసించే పూవులా రాలిపోకుండా తన జీవితం నలుగురికి ఉపయోగపడాలని తన జీవితానికి ఒక అర్ధం ఉండాలని తపన పడుతూ, అలాగే కుటుంబ ప్రాధాన్యత ను అంగీకరిస్తూనే, భాద్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే తన వ్యక్తిగత ఉన్నతి కోసం జీవించడం కూడా అవసరమని నమ్మిన శేషమ్మ గారు నిజమైన స్త్రీ అభ్యుదయానికి నిదర్శనం. వీరి జీవిత కథ లో ఒక పరుపూర్ణమైన స్త్రీ తనకోసం తాను జీవిస్తే తన మేధస్సు ను గౌరవించి, తన్ స్వీయ ఉన్నతికి పాటుపడితే ఆమెపై ఆధారపడి ఉన్న కుటుంబానికి, ఆమె జీవిస్తున్న సమాజానికి ఆమె ఎంత సేవ చేయగలదో తెలియజేస్తుంది. ఉన్నతమైన జీవితం పట్ల కొంత అవగాహన వీరి ఆత్మకథ కలిగిస్తుంది.

సాహిత్య పరంగా పుస్తకంలో కొన్ని లోపాలున్నాయి. ఒక పరిణితి చెందిన రచయిత్రి రాసిన పుస్తకం కాదు ఇది. అందువలన కొన్ని చోట్ల తొందరగా విషయాలు పరిగెత్తినట్లు, మరో చోట కాస ఎక్కువ వర్ణనలున్నట్లు అనిపించడం, మొత్తం మీద కథ చెప్పే విధానంలో ఒక ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. కాని భాష సరళంగా ఉండడం వలన స్కూలు పిల్లలు చేత కూడా చదివించవచ్చు పుస్తకాన్ని. వీరి వాక్యాలలో నిజాయితీ మాత్రం పాఠకులను కట్టిపడేస్తుంది. చాలా సమస్యలు విద్య ద్వారానే పరిష్కారమవుతాయి అని వీరు నమ్మిన సిద్దాంతం ప్రతి వాక్యంలో వినిపిస్తూ ఉంటుంది

సామాన్య స్త్రీలు అసామాన్య జీవితాలు గడిపారని చెప్పడానికి పుస్తకం ఒక మంచి ఉదాహరణ. జీవితాన్ని నిరాశ నిస్పృహలతో కాకుండా ఒక దీక్షతో గడపాలని, జీవితపు విలువను అర్ధం చేసుకుని మనకు కావల్సిన దారిని మనమే నిర్మించుకుంటూ పోవాలనే సందేశం తో వచ్చిన ఆత్మ కథ తప్పకుండా చదవవలసిన మంచి పుస్తకం

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.