కెథారసిస్
–సునీత పొత్తూరి
చటుక్కున కళ్లు విప్పి చూసింది సునంద. ఏదో కల. అది కలా అనే స్పృహ కలిగినా, కల మిగిల్చిన చిన్న అసౌకర్యం మస్తిష్కాన్ని అంటిపెట్టుకునే వుంది. సునంద వచ్చిన కల ఓ క్రమంలో గుర్తు తెచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. పైగా కల కూడా అస్పష్టంగా, తెగిన సాలిగూడు లా.. అన్నీ పొంతన లేని దృశ్యాలు!
ఎవరో గొంతు నులిమేస్తున్నట్టు.. అరుద్దామంటే తన నోరు పెగలడం లేదు. అరుపూ బయటకు రావడం లేదు. అదీ నరకం అంటే!!
జరిగినది తిరిగి తలచుకుంటూ ఫోన్ అందుకుని టైమ్ చూసింది సునంద.’ బాబోయ్ ఎనిమిది దాటింది.’ ఇంత సేపు పడుకుందా..! రాత్రి తోచీ తోచక ఏదో సినిమా చూస్తూ కూర్చుంది దాని ఫలితం ఇది;
లేచి తయారై వంటింట్లో పనిలో వుండగా, బయట తలుపు కొట్డిన చప్పుడు.. వెళ్ళి తలుపుతీసింది. గుమ్మం ముందు నిలువెత్తు సంభ్రమాశ్చర్యాలు కృష్ణ గా మారి..! నిజంగానే పట్టలేని అనందం కలిగింది తనని చూసాక.
” హా…య్ కృష్ణా, వ్హాటె ప్లెజెంట్ సర్ ప్రైజ్! రా రా !”
ఆప్యాయంగా రెండు చేతులూ చాచి స్నేహితురాలిని కౌగలించుకుంది సునంద.
చేతిలో బాగ్ కింద పెట్టి, ప్రేమగా తన ఎడం చేయి స్నేహితురాలి భుజం చుట్టూ వేసి సున్నితంగా నొక్కి వదిలింది కృష్ణ.
” నువ్వురావడం మహా సంతోషం.” సంతోషంగా బాగ్ ని తన చేతిలోంచి తీసుకుని చేయి పట్టుకుని లోపలికి దారితీసింది సునంద.
కొంత సేపటికి కాఫీ కప్ చేతికి ఇచ్చి, తనూ ఒక కప్పు తెచ్చుకుని సోఫా లో విరామం గా కూర్చుంటూ.. “వచ్చి చాల మంచి పని చేసావు కృష్ణా.. ఎన్నాళ్లైందో కలిసి మాట్లాడుకుని.” మనస్పూర్తిగా పలికింది సునంద.
కృష్ణ .. ఆ పేరు లోన ఉన్న ఫిలాసఫీ.. తన నడవడి లోనూను. తన లలిత గంభీర సౌందర్యానికి అతికినట్టు ఉన్న ఆ చక్కని పేరుకు ముచ్చట పడేవారు ఎవరైనా. చాలా లోతైన మనిషి. అలాగె సున్నితమైన ది కూడా. కృష్ణ సునందకి బాల్య స్నేహితురాలు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు డిగ్రీ వరకూ.
“పుస్తకాలు కొత్తవేం చదివావు? నీ రివ్యూ లు బాగుంటాయి కృష్ణా.”
” ఈ మధ్య చదవడం తగ్గించేసానే..” ఆమె స్వరం లో ధ్వనించిన నిరుత్సాహం సునందనేమీ ఆశ్చర్య పరచలేదు. కొన్నాళ్ళు గా గమనిస్తూ నే వుంది.
ఒకప్పుడు జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ పట్డుకుని, గొప్ప పరిశోధనే చేసింది. ఆ నోట్స్ అంతా తన డైరీల్లోనే నిక్షిప్తం. అందులో ఉన్ననాళ్లూ.. ప్రతి రెండు మాటల్లోనూ, ఆయన్ని కోట్ చేసేది.
తన అన్యమనస్కతను గమనించీ, గమనించనట్డుగా
“అన్నట్టు పొద్దున్నే బయలుదేరినట్టున్నావు.. నువ్వు కాస్త ఫ్రెషప్ అవు కృష్ణా.. నేను మనకోసం ఏం చేయగలనో చూస్తా..” అని కూర్చున్న చోటు నుండి లేచింది.
వంటింట్లోకి వెళ్లబోతూ.. ‘మరో కప్ కాఫీ ?’ అడిగింది. కావాలన్నట్టు తలూపి, సునందని అనుసరించింది.
పనులు చేస్తూ సునంద ఏదో ఒకటి మాట్లాడుతూ నే వుంది. కృష్ణ ఇంకా తన ఆలోచనలు తెగనట్టు చాలా సేపు మౌనం గా వింటూ వుంది.
“శేషు ముంబై కాంప్ వెళ్లారు. వారం అయింది.”
“పిల్లలు ?”
“రాత్రి వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్లారు. అటునుండి అటే వాసు యింటికి వెళ్తాం అన్నారు. థియేటర్ కి దగ్గరని లే. “
మౌనంగా వింటోంది సునంద. వాసు కృష్ణ తమ్ముడు. కృష్ణ, వాసు ఇద్దరే. కృష్ణ పెళ్లికి ముందే వాళ్ల నాన్నగారు వెళ్లిపోయారు. వాళ్ల అమ్మగారు వాసు దగ్గరే ఉంటారు. సునంద కి వాళ్ల కుటుంబ సభ్యరాలి లాగే అందరితో పరిచయం, చనువూను.
” శేషు ఈ వీకెండ్ రావాలి. కాని ఫ్రెండ్స్ తో ఏదో సైట్ సీయింగ్ ట.
ఒక్కద్దాన్నే బోర్ అనిపించి బస్సెక్కి ఇలా వచ్చేశాను. ఎటూ రేపు శనివారం కదా నువ్వు హైదరాబాదు బయల్దేరేది.” సునంద కేసి సాభిప్రాయంగా చూసింది.
అప్పుడు గమనించింది సునంద కృష్ణ మాట్లాడుతుంటే మాట లో ఏదో డ్రాగ్. కళ్లలో కూడా ఏదో మార్పు. ఏమై ఉంటుంది?
ఆలోచిస్తూ నే ఫ్రిజ్ లోంచి వంకాయలు తీసి.. తరగడం మొదలు పెట్టింది సునంద.
“సుందూ ఏమిటోనే పుచ్చు వంకాయలు తరుక్కుంటూ..మన బుల్లి సంసారాలే లోకంగా బతికేస్తున్నాం. ఇదేనా జీవితం అంటే ! మగవాళ్ళు చూడు. ఇంటా, బయటా రెండు ప్రపంచాల్లోను మహరాజుల్లా బతికేస్తారు. ఎవరిదాకానో ఎందుకు, శేషు చూడు.. కాంప్ కి వెళితే ఇల్లు కనిపించదు.
తను ఎక్కువ రిలాక్సేషన్ కోరుకుంటున్నారు ఈమధ్య. మిడ్ లైఫ్ క్రైసిస్ ..!”
సునంద తలవంచుకునే పని చేసుకుంటోంది.. freudian slip..అంటే అదేనా? ఏం చెప్ప దలచుకుంది? తల తిప్పి చూసింది సునంద. పెదవులు బిగబట్డి అక్కడే ఉన్న సన్నని చాకు ని గట్డుమీద గట్టిగా గుచ్చి పట్టుకుని.. ఉంది కృష్ణ.
గట్డిగా నవ్వింది సునంద. వాతావరణం తేలిక పరుస్తున్నట్టు
” మరేం చేద్దామంటావ్? మనం ఒక్కళ్లమే సమాజం చక్కబెట్టేద్దామనే! తరిగిన కూరముక్కలు పోపులో వేసి మూత పెట్టింది.
“ఆ మాటకేం గాని, అన్నట్టు కృష్ణా.. ఇప్పటి సంగతి చూద్దాం. నువ్వొచ్చావుగా కాజువల్ లీవ్ పెట్టేశాను. రోజంతా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇదిగో, నా వంట అయిపోవచ్చింది.. నేనూ బ్రేక్ ఫాస్ట్ చేయలేదు. నువ్వు ఎప్పుడు అంటే, అప్పుడు అన్నాలు తినేద్దాం సరేనా.”
కృష్ణ కి స్నానానికి చూపించి..లోపలకి వచ్చి కూర్చుని ఆలోచనలో పడింది సునంద.
కృష్ణ ది శేషగిరిరావు ది ప్రేమ పెళ్ళి. ఆ విషయం లో కూడా కృష్ణదే చొరవ అని తెలుసు. ఇద్దరి మధ్యా గొడవలు అనేవి లేవు అనీ తెలుసు. అయినా మార్పులు రావటానికి ఎంతసేపు? ఆ మాటకి వస్తే ట్రాన్సఫర్ వల్ల తను దూరం గా వుంటోంది అని కాని, రఘు మాత్రం… హ్మ్! సునంద మూడు సంవత్సరాల నుంచి వరంగల్ లో ఉంటోంది. వారాంతం లో హైదరాబాదు వస్తూ, పోతూ.
రఘు కి ఫోన్ చేసింది.. ఈ వీకెండ్ ఇంటికి రావడం లేదని చెప్పడానికి. డ్రైవింగ్ లో వున్నాడట. ఆఫీస్ కి వెళ్లాక చేస్తా అన్నాడు. మెసేజ్ పెట్డింది. కృష్ణ తనదగ్గర కు వచ్చిన విషయం. వెంటనే ..ఓ తమాషా ఎమోజీ పెడుతూ.. ‘ఒకే..ఎంజాయ్..’ అన్నాడు.
అనుకున్నట్టే మరో అరగంటలో భోజనాలు కానిచ్చి గదిలోకి వచ్చి కూర్చున్బారు ఇద్దరూ. రెండు రిమోట్లూ తీసుకుని టివి ఆన్ చేసింది సునంద. ఏదో హిందీ ఛానెల్ . సినిమా లో హృతిక్ రోషన్ “నీ హీరో…” అంది కృష్ణతో. నవ్వేసింది కృష్ణ.
“అది అప్పుడు.. అదేమిటోనే ఈ నెట్ వచ్చాక. ఆడా, మగా అందరికీ ‘వాయిరిజమ్’ ని హాబీ గా మార్చేసాయి కదా..”
“బాబోయ్.. ఎంత మాట అనేసావ్! అయితే వద్దంటావా! సరే. కాస్త ఇలా నడుం వాల్చి మాటాడుకుందాం.
టివి ని మ్యూట్ చేసి వచ్చి.. కృష్ణకి తలగడ ఇచ్చింది.
పక్కన కూర్చుని, కృష్ణ చేతులను తన చేతుల్లోకి తీసుకుంది.
మెత్తటి వేళ్లు.. చిన్నగా కంపిస్తూ.. నిట్టూర్చింది సునంద. ఏదో అవగతమవుతునే వుంది.
కృష్ణ కు ‘మూడ్ స్వింగ్స్’ ఎక్కువ. ఎంత గాఢంగా ప్రేమిస్తుందో, తృటిలో అలకా తెచ్చుకుంటుంది. తనని చూసీ చాలా కాలం అయింది అనుకుంది.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళు.. నిశ్శబ్దంగా…!
కాసేపాగి సునంద అంది. సాయంకాలం భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్దాం. కాసేపు పడుకో కృష్ణా ఎప్పుడు లేచావో.. ఏమో. తను అటు పక్కకు వొత్తిగిలి పడుకుంది.
కృష్ణ కి నిద్ర రాలేదు. గుండెని చేత్తో వొత్తినట్డు ఏదో తెలియని అశాంతి. ఏదో పత్రిక చేతిలోకి తీసుకుంది కాని దృష్టి నిలప లేకపోయింది.
సాయంత్రం ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. జనం ఉన్నా చక్కని దర్శనం అయింది అంది సునంద సంతృప్తి గా.
గుళ్లోనే అనువైన చోటు చూసుకుని కూర్చున్నారు ఇద్దరూ.
కృష్ణ కి మౌనమే ధ్యానం అయింది.
భక్తిగా తనలో తాను లలితా సహస్రనామం చదువుతూ ఉన్న సునంద కేసి చూసింది. ఎంతో లీనమై వుంది సునంద.
సునంద నిత్య సంతోషి. కాలేజి రోజుల్లోనూ అలాగే వుండేది.
అందమైనదే కాదు, లోకం పోకడ తెలిసినది కూడా. అందుకే ఏవో శాఖలు, గోత్రాలు అంటూ చివర్లో హాండ్ ఇచ్చిన చలాన్ని ఇట్టే క్షమించేసింది. అసలతన్ని ఆ పేరు చూసే ఇష్ట పడింది.. కాని..
అందుకు విరుద్ధంగా తేలాడు. తర్వాత తన కొలీగ్ రఘు తో
ప్రేమపెళ్లి. మారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అనేస్తుంది.. మళ్లీ మాటాడుతే. కాని తనది ప్రేమించే మనసే. తమకు పిల్లలు లేరు అన్న లోటు తెలియకుండా ఉంటారు రఘు, సునందా.
చుట్టూ పరికించి చూడసాగింది.
అక్కడక్కడా కూర్చుని ఉన్న జనాలు సునంద లాగే ఏదో చదువుతూ..
కుంకుమ తీసుకుని శ్రద్ధగా నుదుట దిద్దుకుంటూ..
కూడా వచ్చిన పిల్లలను సముదాయిస్తూ… ఇలా తలోవిధంగా!
అసలు వాళ్ళు ఏపని చేస్తున్నా అందులో శ్రద్ధ..ఇన్వాల్వ్మెంట్…!
ఆఖరికి, పక్కనే చెరువు మీద నుండి ఎగిరే పక్షుల లో కూడా ఎంతో ఒద్దిక, క్రమశిక్షణ కనిపించాయి.
పొద్దుట తను బయలు దేరి వచ్చినప్పుటి పరిస్థితి గుర్తుకు వచ్చింది కృష్ణకి. నిప్పులు మింగినట్టు.. మనసూ దేహము ఉడికిన సందర్భమూ.. !
ఇప్పటికి ఎంతో సేదదీరినట్టు గా వుంది. వాతావరణ ప్రభావం తన పైన కూడా వుందేమో. సన్నని నవ్వు పెదవిపైకి వచ్చి చేరింది.
“వెళ్దామా?” సునంద మాటలకి ఆలోచన వదిలి బయట పడింది. లేచి సునంద చేయి పట్డుకుంది.. ఆ స్పర్శ లోని మార్దవం గమనించక పోలేదు సునంద.
వేయి స్తంభాల గుడికి కూడా వెడదాము అన్న సునంద మాటకి అడ్డు వస్తూ.. ఇంకోసారి చూద్దాం.. ఇంటికి పద అన్నది.
” ఇంకోసారి అంటే రేపనా.. రేపు రామప్ప గుడికి వెళ్దాం . రేపు నాకు సెకండ్ సాటర్ డే కదా..శలవే.”
“అంటే నీకు రెండు రోజులు శలవా…అరె నాకు తెలియదు.” నొచ్చుకుంది కృష్ణ.
” అంత దృశ్యం లేదు.. రాక రాక వచ్చావు.మస్తు ఎంజాయ్ చేద్దాం..సరేనా! ముందు హోటల్ కి వెడదాం పద ఐస్ క్రీం తిని చాలా రోజులైంది..”
“సరే పద ఐస్ క్రీం అంటున్నావ్.. !” అంది తనే ముందుగా అడుగులు వేస్తూ.
హోటల్ లో డిన్నర్ అయి బయటకి వచ్చి చూస్తే , బయట నిర్మలాకాశం లో అష్టమి చంద్రుడు అమ్మవారి దయలాగ సమంగా వెలుగు పరచాడు.. ఆపైన సేద తీర్చే సన్నని చల్లటి గాలి.
” థాంక్యూ సుందూ..” అంది కృష్ణ తన్మయత్వంతో.
“అంటే..?..తనకేసి చూసి, “ఓహో..అదా.. ఆ ధన్యవాదాలు నేను నీకు చెప్పాలోయ్.. ఇంత చక్కని సాయంత్రం నాకు బహుమతి గా ఇచ్చినందుకు.. లేకపోతే ఈ పాటికి హైదరాబాదులో.. ఇంట్లో రేపటి టిఫిన్ కి పప్పు రుబ్బుకుంటూ వుండేదాన్ని” అంది పకపకా నవ్వుతూ.
“ఇప్పుడు మాత్రమేం..ఆలస్యం ఏముంది లాస్ట్ బస్ కి పోదాం పద మీ రఘు నన్ను తిట్టు కుంటూ ఉంటారేమో.. వీకెండ్ స్పాయిలర్ ని అని.”
“అదేం మాట కృష్ణా.. రేపు రామప్ప గుడి చూడ్డానికి ప్లాన్ చేసాను. ఫర్వాలేదు. నాకు నా స్పేస్ ఎప్పుడూ వుంటుంది. రఘు కి అసలు ఎలాంటి అభ్యంతరం వుండదు.”
“లేదురా.. రామప్ప గుడి కి శేషు పిల్లలని కూడా తీసుకుని మన కారులో నే వెళ్ళి వద్దాం అన్నారు కూడా.. “
“ఆర్యూ…ష్యూర్?.” “ఎస్. ఐయామ్ ష్యూర్ డియర్”
ఇంటికి చేరుతూనే తన బాగ్ ఇవతల కి తెచ్చింది కృష్ణ. పద బస్ స్టాండు కి పోదాం..అంటూ.
“ఇదేం అన్యాయమే నా చేత ఇడ్లీ పిండి రుబ్బించే కంకణం కట్డుకున్నావ్..” మురిపెంగా అంటూ అంతకు పూర్వమే సర్ది పెట్టుకున్న బాగ్ బయటకు తీసింది సునంద.
“రోజంతా ఎలా గడచిందో తెలియనే లేదు..కృష్ణా. అడపాదడపా ఇలా కాస్త కలుసుకుంటూ వుండాలి మనం. ఇదిగో వచ్చే నెలలో నాకూ హైదరాబాదు ట్రాన్సఫర్ రావచ్చు. అప్పుడు మనం తరచూ కలుసుకోవచ్చు…” సునంద మాటలు ప్రవాహం గా వచ్చేస్తున్నాయి.. కృష్ణ నిర్ణయం పట్ల లోలోపల ఉన్న హర్షం కావచ్చు.
************
జూబ్లీ బస్ స్టాండ్ లో బస్ దిగి.. ఇద్దరూ చెరో వేపు ఆటో ఎక్కారు.
దాదాపు సైనిక్ పురి లో ఉన్న తమ ఇల్లు చేరుతుండగా.. మెసేజ్ నోటిఫికేషన్.. వచ్చింది.
” సుందూ..
జీవితం లో కొన్ని క్షణాలు ఉంటాయి కుంగదీస్తూ.. అందుకు మూల కారణం ఏదీ ఉండక్కర్లేదు. కాని, ఎక్కడో ఏదో వెలితి. అగాధం అంటే బాగుంటుంది. పడబోతూ, నిలదొక్కుకుంటూ చాలా ఘర్షణ పడతాం. మనతో మనమే. మనకి మనం కూడా నచ్చం.. ఉన్నట్టుండి అదృశ్యం అయితే బావుండనిపిస్తుంది.
శేషు తో నాకే పేచీలు లేవు. నాతోనే అతనికేమో అనే బెంగ ఎక్కువైంది. నిద్దర పట్టడం లేదంటే, మా ఫామిలీ డాక్టర్ స్లీపింగ్ పిల్స్ ప్రిస్క్రైబ్ చేసారు. రోజూ కాదు.. బాగా డిస్టర్బ్ అయినపుడు. కాని, ఆ గాప్ ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ఇదిగో నిన్న శేషు వీకెండ్ రావడం కుదరదు అంటే..పిచ్చిగా అనిపించింది.
అటువంటి అస్తవ్యస్త పరిస్థితి లో నేను నీ దగ్గర కి వస్తే, ఏ ప్రశ్నలూ వేయకుండా సేదదీర్చావు చూడూ… నువ్వూ స్నేహితురాలివి అంటే. నిన్ను చూస్తే జీవితాన్ని ప్రేమించడం అంటే ఏమిటో తెలిసింది.. ఆ కాసేపట్లోనే. గాయానికి చల్లని లేపనం పూయడం నీకు తెలుసు… అది నీకు తెలుసా?
మన ఇన్నేళ్ల స్నేహం లో ఇవాళ రోజు నాకు ప్రత్యేకం .. తెచ్చుకున్న నిద్రమాత్రలు కాలవలోకి విసిరేశా. అందుకు నీకు నా కృతజ్ఞతలు.
మరోమాట.. దూరం మనసులను కూడా దూరం చేస్తుంది ఒకోసారి. వీలైనంత త్వరలో నీకూ హైదరాబాదు ట్రాన్సఫర్ వచ్చి సంతోషంగా నీ ఫామిలీ తో వుండాలి అని మనస్స్ఫూర్తి గా కోరుకుంటున్నాను.
మనం గుడినుంచి బయటకు వస్తున్నప్పుడు.. శేషు మెసేజ్ చేశారు. సాయంత్రం ఫ్లైట్ లో తిరిగి వస్తున్నానని.
ఆల్ ఈజ్ వెల్.. థాంక్యూ. ప్రేమతో.. తిరిగి ప్రేమలో జీవితం తో
–కృష్ణ.”
కృష్ణ కు ఉన్న డిప్రెషన్ తనకు తెలియనిది కాదు. కాని దాని తీవ్రత మాత్రం ఊహించలేదు. కృష్ణ మాటల్లో తేడాతో బాటు, కృష్ణ బాగ్ లో స్లీపింగ్ పిల్స్ బాటిల్, తను బాగ్ లోంచి ఏదో తీస్తున్నప్పుడు గమనించింది. మనసు చిక్కబట్టుకుని,తనకి తెలియకుండా తను ఆమె భర్త శేషుకు మెసేజ్ చేయడం మంచిదైంది. శేషు తనకీ మెసేజ్ చేసారు. వెర్రిపిల్ల కాపోతే.. ఇంత ప్రేమించే మనసు గలది .. ఎలాటి నిర్ణయాలు తీసుకుంటుంది!
****
పేరు: సునీత పొత్తూరి స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా లో ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను. కాలేజి చదువు అంతా వైజాగ్ లో గడిచింది. ప్రస్తుత నివాసం హైదరాబాదు. చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం ఇష్టం. రిటైర్ అయ్యాకే రచనా వ్యాసంగం మీద ఆసక్తి కలిగింది. నా సొంత బ్లాగ్ ఒకటి పెట్టుకున్నా, ఎక్కువ గా ఫేస్బుక్ లో నే ట్రావెలోగ్స్ అవీ రాసాను. గత సంవత్సరం అంటే 2019 లో ఫేస్బుక్ లో భావుక గ్రూప్ లో చేరాక వారి ప్రోత్సాహంతో కథలు రాయడం మొదలు పెట్టాను. అలా దాదాపు పధ్నాలుగు చిన్న కథలు రాసాను. భావుక బృంద అడ్మిన్లు, ఇతర సభ్యుల ప్రోత్సాహం వలనే రాయగలిగాను. అందరికీ ధన్యవాదాలు. కథా సంకలనంలో ని ఇతర రచయితలకు అభినందనలు.
చాల బాగుంది
Excellent mam 😊👍
థాంక్యూ అండీ.
Sunitha, it’s really superb, small but very interesting. I mean I can’t write more but I like the story. Please keep it up.
థాంక్యూ శ్రీదేవి గారు.
చాలా బాగుందండీ.