సర్వధారి- సంవేదనల కవితాఝరి
-వురిమళ్ల సునంద
కవితా సంపుటి పేరు చూడగానే ఇది సర్వధారి సంవత్సరానికి సంబంధించి రాసిన కవితలు కావచ్చు అనే అపోహ కలగడం సహజం.. కవయిత్రి ఇందులో మనిషి జీవితంలోని ఆశలు,ఆశయాలు స్నేహం.స్వప్నాలు, భావోద్వేగాలు, ఉద్యోగం పండుగలు పబ్బాలు, సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఒకటేమిటి మనిషి సకల అనుభవాల ఆకృతి ఇందులో దాగుంది కాబట్టి .. సర్వం కలిగియున్నదనే అర్థంతో ‘సర్వధారి’ అని ఈ సంపుటికి నామకరణం చేశానని తన మాటలో చెప్పుకుంటారు.
నిజమే ఇందులో ప్రతి కవిత అనుబంధాలు ఆత్మీయతలు,అంతః సౌందర్యం, తనను కదిలించిన
అనేకానేక సంఘటనలను తన దైన శైలిలో కవిత్వీకరించారు.శ్రీమతి అనితా సూరి గారు.
ఈ సంపుటి ముఖ చిత్రం చాలా ఆకర్షణీయంగా తన పిల్లల చిత్రాలతో ఉండటం విశేషం. ఇందులో డెబ్బై రెండు కవితలున్నాయి.
వీరి మొదటి కవిత విఘ్నాలను తొలగించే అధినాయకుడు వినాయకుడి గురించి నాయకుడు- వినాయకుడు అనే కవితతో మొదలవుతుంది. ఓట్ల కోసం మాటలతో మాయ చేసే నాయకుడికి … చిన్న పత్రి నమస్కారాలకే ఉప్పొంగి పోయే వినాయకుడికి మధ్య ఉన్న భేదాన్ని చూపుతూ రాసిన కవితతో .. అంతర్లీనంగా రాజకీయాలను గురించి చెప్పడం బాగుంది. ఇక అమ్మంటే.. అమ్మ ప్రేమ కవితల్లో అమ్మంటే కనిపించని వంశ వృక్షాన్ని / కనిపెంచే తల్లి వేరు అమ్మ.. అంటూ విరిసే మల్లెలు అమ్మ ప్రేమలా కోయిల గానం లాలి పాటలా ఉంటుందని అమ్మను ఉగాది తో పోల్చడం బాగుంది.. ఉగాది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది కానీ “అమ్మ ప్రేమ మాత్రం పాతే” అంటూ అమ్మ ప్రేమను నిజాయితీగా చెబుతారు. ఇంకా అమ్మ గురించి మరికొన్ని కవితల్లో అద్భుతమైన వ్యక్తీకరణ ఉంది. “కష్టాల వేళ కనురెప్పై నిలిచి”/ సుఖాల వేళ చిరునవ్వై దీవించి… ఎంత గొప్పగా ఉన్నాయో ఈ కవితా పాదాలు… ఇందులోనే మరో చోట దేవుడు కనిపించలేదని బాధ పడతాడెందుకు జీవుడు.. “అదిగో..అవే! అమ్మనే అమృత మూర్తి పాదాలు”/ పుట్టిన ప్రతి ప్రాణి తలవంచి/ అర్పించాలి ప్రణామాలు”….అంటూ అమ్మ కనిపించే దైవమని చెప్పకుండానే చెబుతారు. ఇది చదివినప్పుడు
కప్పి చెప్పేది కవిత్వం..విప్పి చెప్పేది విమర్శ “అన్న సినారె గారి మాటలు గుర్తుకొస్తాయి.
అందమంటే” కవితలో” బ్యూటీ పార్లర్ లో కొనుక్కునేది కాదు/
మేకప్ ముసుగుతో కవ్వించేది కాదు/మొగ్గలా ఉంటూనే మానవత్వంతో మురిపించాలి.. అందరినీ ఆకట్టుకోవాలి. / నిండు నిర్మలంగా వుంటూనే నిన్ను నువ్వు నిరూపించుకోవాలని ‘రాసిన కవిత… అందాల ప్రదర్శనలు పెట్టిన వారిని, అందులో పాల్గొన్న వారందరినీ ఘాటుగా విమర్శిస్తూ.. నిండైన ఆడతనాన్ని ఎవరైనా గౌరవిస్తారని అంటూ రాసిన కవితలో అందమంటే అద్భుతమైన నిర్వచనం ఇస్తూ ఇప్పటి యువతకు ఓ హెచ్చరిక లా ఉంటుంది.
ఓట్ల కోసం చేసే జిమ్మిక్కులను బుడబుక్కల వేషాలని చెబుతూ .. వాళ్ళు వేసే “రంగుల వల” కు చిక్కామో ఇక ఇంతే సంగతులు.. తాత్కాలిక తాయిలాలకు తలొగ్గితే /ఒడ్డున పడ్డ చేప పిల్లవై అల్లాడి పోక తప్పదు” అని జరుగుతున్న నేటి మాయావి రాజకీయాలు ,ఓట్ల గురించి చెబుతారు.
“ఫాస్ట్ ఫుడ్” కవితలో నేటి యువత ఎగబడి తింటున్న ఫాస్ట్ ఫుడ్ ఎంత హాని చేస్తుందో హెచ్చరించారు. ఆరోగ్య కరమైన అలవాట్లు పక్కకు తోసి పిజ్జాలు బర్గర్లు,కర్రీపఫ్ లు, బ్రెడ్ జామ్ లు , నూడుల్స్.. ఇవన్నీ తిని తిని యువత బరువెక్కిన శరీరాలతో రోగాల బారినపడుతున్నదని.. చెప్పిన కవిత .. ప్రస్తుత కరోనా కాలంలో.. అలాంటి వాటి కోసం బయటికి వెళ్ళక పోవడం వల్ల ఎందరో ఆరోగ్యంగా ఉన్నది మనం గమనించాం కూడా..
మరో కవిత బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ “బాల్యామృతం” కవితలో ” మలి సంధ్యలో సైతం/ మళ్ళీ మొలకెత్తే తూర్పు వాకిళ్ళు తెరిచి/ కొంగ్రొత్త ఆశల విత్తులకు ఊపిరి పాదులు త్రవ్వి/ కొడిగట్టని ఆశయాల కాంతిధారతో తడిచి/ పచ్చని తలపునై అంకురిస్తూనే వున్నా”… బాల్య జ్ఞాపకం ఎప్పుడూ బతికించే అమృతమే అందుకే ఆ శీర్షిక ఎంతో సముచితంగా ఉంది.
ఇందులో ప్రతి పంక్తి అందమైన ప్రతీకల మయమే. కానీ నేటి బాల్యం ఇలాంటి మధురమైన ఇలాంటివి ఎన్నో కోల్పోతుందని వాపోతూ ‘నేటి బాల్యం’ బాల్యం మారింది కవితల్లో రాస్తూ నాటికి నేటికీ ఎంత మారిపోయిందో.. ఈ పంక్తులు చెబుతాయి “నేటి బాల్యం” అపార్ట్మెంట్ ఇళ్ళు/ క్రేన్ ఊయలలు… సెల్ ఫోన్లో కబుర్లు.మరో కవితలో భవిష్యత్తు ప్రణాళికతో / వర్తమానాన్ని కోల్పోవడం/ నేటి మెకానిక్ బాల్యానికి మచ్చు తునకలు.. రాసిన కవితలు పఠితలను ఆలోచింపజేస్తాయి’.ఆశల పందిరి” కవితలో ‘ వెన్నెల
పోగులతో/ నేసిన వస్త్రాలు కట్టుకోవాలని… ఇంద్ర ధనుస్సు నీడలో ఇల్లు కట్టుకోవాలని.. ఇలాంటి ఊహల ప్రపంచంలో విహరిస్తూ రాసిన పంక్తులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.ఇలాంటి భావాన్నే తెలిపే మరో కవిత పచ్చిక పొత్తిళ్ళలో/ పసిమంచు పాపలు… వాడని తలపుల్లో / వీడని జ్ఞాపకాలు/… ఎదురు చూశాక వచ్చి/ తిరిగి చూసేంతలో కరిగిపోయే… ఆ క్షణాలు.. మళ్ళీ మళ్ళీ..ఏవీ? రావే వీ… అని చక్కని అభివ్యక్తి తో సున్నితమైన హృదయాన్ని ఆవిష్కరించారు. ఇక “హ్యాపీ హ్యాపీ రిటైర్మెంట్” లో ఉద్యోగం లో ప్రవేశించి.. విరమణ కాలానికి మధ్య కాలమంతా
‘ ఇట్టే కరిగిపోయే/ పిప్పర మెంట్/ మళ్ళీ అదే అవుతుంది అన్ని బాధలకు అయింట్ మెంట్/ ..మధ్య కాలంలో జరిగినవన్నీ తలుచుకుంటే అప్ సెట్ అనేదే ఉండదని అంత్య ప్రాసలతో అలరిస్తారు.
“స్వాగతం… సర్వధారి” ఈ సంపుటికి శీర్షిక అందులోని “సర్వధారి” నే.. ఉద్యోగం చేసే
స్త్రీ ఇంట్లో ఎన్ని పాత్రలు పోషిస్తుందో . ఉగాదిని ఆహ్వానిస్తూ “నేనో సాధారణ నారి”/ నవరసాల బహుపాత్ర ధారిగా రాసిన కవిత లాంటిదే ఈ పనుల్లో అలసిపోతూ ఇల్లాలిగా, ఉద్యోగిగా, ఏం కోల్పోయిందో ” చేజారిన వసంతాలు” కవితలో.. కళ్ళజోడు సర్దుకుంటూ పరికిస్తే/ ఏం అనుభూతుల్నీ వెంట తెచ్చుకోక/ గతించిన నవయవ్వన చిత్తరువునై/ గోడపైన నలు చదరపు చట్రంలో/నవ్వు పులుముకుని మిగిలా” అంటూ ఎప్పుడో యవ్వనంలో దిగిన చిత్రం చూస్తూ వాపోవడాన్ని..మరో కవిత ” ఈ…నా ప్రమాది’ లో ఉద్యోగం కోసం పల్లెను వదిలి వచ్చి తానేం పోగొట్టుకుందో ఈ మాటలు చాలు’ వడలిపోయిన రెప్పల కింద/ వసంత రాత్రులను జారవిడుచుకోవడం’ ఇలాంటి వెన్నో.. ఈ సంపుటిలో ఉన్నవి. పండుగలు వస్తే మధ్య తరగతి జీవితాన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో నెట్టేస్తాయో.. నిన్న దసరా/ కావల్సినంత దండుకెళ్ళింది/ నేడు దీపావళి/ కంటి చూపుతో కాల్చేసి వెళ్తుంది’ అంటారు.. “కవిత్వం జీవితానికి సాక్ష్యం/ జీవితం పూర్తిగా తగలబడి పోతున్నప్పుడు/ మిగిలే బూడిద కవిత్వం-కెనడా కవి లియోనార్డ్ అన్న మాటలు అక్షరాలా నిజమనిపిస్తాయి. అనిత గారు ఉద్యోగిగా తన అనుభవాలను జోడించి అలాగే
సమాజం లోని సమాజంలోని ప్రతి సంఘటనకు స్పందిస్తూ..ఆ స్పందనలను అక్షరాల్లో నిక్షిప్తం
చేసిన తీరు .. అద్భుతంగా ఉంటుంది. అక్షరమే కవి ఆయుధం అక్షరమే పరబ్రహ్మ స్వరూపం.ఈ అక్షరాలే సాహిత్యంలో సింగిడి రంగులను అద్దుకుని విరాజిల్లే వివిధ రకాల ప్రక్రియలు అవుతాయి.
. ‘అక్షరం’ అనే శీర్షికతో రాసిన కవిత ఎన్నో బలమైన పదబంధాలు, ప్రతీకలు ఉపమానాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారో చూద్దాం” కవి అమ్ముల పొదిలో/ ఓ బలమైన అస్త్రం అక్షరం/ హృదయం ద్రవించినపుడు కలం మేఘమై కాగితపు నేలను/ ఓదార్పు హస్తమవుతుంది… అక్షరం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం/ అఖిల జగతిని నడిపే దివ్యౌషధం” … అంటూ అభివ్యక్తీకరించిన తీరు చేయి తిరిగిన కవయిత్రి అని చెబుతుంది. స్నేహం గురించిన కవితలో అంటారు ” అభిమానం అనే ప్రేగు తెంచుకుని పుట్టేది/నమ్మకమనే ఆస్తి పంచుకుని పెరిగేది/ అది .. నిజమైన స్నేహం అని నిర్వచించడం బాగుంది.
విలువున్న మనీ-షీ కవితలో స్త్రీని డబ్బు తో ముడిపెట్టి ఆలోచించే సమాజాన్ని వేలెత్తి చూపుతూ ‘ నీవు పుట్టావని ఆలోచనతో/ తండ్రి వెనకేసి పెడతాడు/ … కోరిన వాడు తాళి కడతాడు… ఇంటల్లుడు” చూడవస్తాడంటూ ఆమె చుట్టూ డబ్బు తిరగడాన్ని చెప్పిన తీరు పఠితులను ఆలోచింప చేస్తుంది.. ఇందులో కవితలు చదివినప్పుడు సుప్రసిద్ధ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి మాటలు గుర్తుకు వస్తాయి ” “కవిత్వం ఒక ఆల్కెమీ’ దాని రహస్యం కవికే తెలుసును. కాళిదాసు కు తెలుసు.పెద్దన్నకు తెలుసు. కృష్ణ శాస్త్రి,శ్రీ శ్రీ కి తెలుసు.పాఠకుడిని అనుభూతి ఆకారం హత్తుకోవాలి.కవి కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి.కదిలించాలి” అంటాడు.మరి అనిత గారి కవిత్వం చదువుతున్నప్పుడు తాను కవిత్వ శిల్పం, వస్తువు ను సమాజం నుండి ఎలా గ్రహించి.. దానిని ఎంత అందంగా మలచడం తెలిసిన అనుభవశాలి అనిపించకమానదు. ఇంకా ఇందులో పుట్టిన శిశువును కుప్పతొట్టి పాలు చేసినప్పుడు ఆ పసిబిడ్డ ఆత్మ ఘోష వినిపిస్తూ తల్లిని ‘ నీ ఆనందానికి అడ్డు అనుకుంటే / పుట్టకముందే చంపేయకుండా/ ఇంతటి యాతన నాకివ్వాలనుకున్న నువ్వు అమ్మవా?”… మనుషుల మధ్య సంచరించే కామ పిశాచానివా” అనడం పాప దృష్టిలో నిజం కావచ్చు కానీ ఏ తల్లి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను పారేయాలని అనుకోదు.. బిడ్డ కోసం సర్వం త్యాగం చేయడంతో ముందుండేది తల్లినే.. ఆ బిడ్డ ఆమె ప్రమేయం లేకుండానే పరువు కోసమని తల్లిదండ్రులో, ఆడపిల్ల అని అత్తమామలో… అలాంటి దుర్మార్గులు తల్లిని బిడ్డను వేరు చేస్తారు. మనం చూస్తూనే ఉన్నాం మన సమాజంలో జరుగుతున్న సంఘటనలను.. ఇంకా ఇందులో మరెన్నో ఇష్టంగా చదివించే కవితలు ఉన్నాయి.
, ఉగాది కవితల్లో ‘ఉగాది పచ్చడి’ కవితలో లతా మంగేష్కర్ గళంలా/ లలితంగా కూసే కోయిల….వెనిల్లా ఐస్ క్రీం లా ఊరిస్తూ వచ్చే వెన్నెల…ఇలా వర్ణ భరితమైన కవిత .రచయిత్రి కి పదాలపై ఉన్న పట్టును తెలుపుతుంది…ఇలా ప్రతి అంశాన్ని అందమైన కవితగా మలిచి మొదటి సంపుటి తోనే ప్రముఖ కవయిత్రుల పట్టికలో చేరినందుకు కవయిత్రికి అభినందనలు…ఈ కవితా సంపుటిని తన తల్లిగారైన శ్రీమతి అండే తులసి గారికి అంకితం ఇచ్చారు. అలాగే తన శ్రీవారికి “అమ్మ’ తరువాత ‘ఆయనే”!! అన్న శీర్షిక చదివితేనే తెలుస్తుంది కవయిత్రి గారి శ్రీవారు ఆమెను ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నారో.. తన విజయం వెనుక నిలిచిన ఆదర్శ భర్త,అమ్మ తర్వాత అమ్మ ఆయనే అంటూ రాసిన మనసు కవితను సమర్పించారు.ఇలా అర్థాంగి ఉన్నతికి తోడ్పడే భర్త ఉన్న ఇల్లు ఆనంద నిలయమే కదా.. శ్రీమతి డేగల అనితా సూరి గారి కలం నుండి మరికొన్ని కవితా సంపుటాలు రావాలని కోరుకుందాం..
*****
నా పేరు వురిమళ్ల సునంద, ఖమ్మం. నేను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయిని గా పని చేస్తున్నాను. నా ప్రవృత్తి- సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించడం సాహిత్యం పై మక్కువతో కవితలు కథలు బాల గేయాలు ,బాలల కథలు, సమీక్షలు రాస్తూ ఉంటాను. నా ముద్రిత రచనలు 1వరిమళ్ల వసంతం -కవితా సంపుటి 2.బహు’మతు’లు -కథా సంపుటి 3. వెన్నెల బాల -బాల గేయాల సంపుటి 4.మెలకువ చిగురించిన వేళ-కవితా సంపుటి నా సంపాదకత్వంలో వెలువడిన పుస్తకాలు 1. చిరు ఆశల హరివిల్లు- బాలల కవితా సంకలనం 2.ఆళ్ళపాడు అంకురాలు- బాలల కవితా సంకలనం 3. పూల సింగిడి -బాలల కథా సంకలనం 4.కలకోట కథా సుమాలు బాలల కథా సంకలనం 5. ఆసీఫా కోసం- కవితా సంకలనం ( ఆసీఫా ఉదంతం పై స్పందించిన సుమారు 230 పైగా రచయితల/కవుల కవితా సంకలనం.