జోగినీ మంజమ్మ – ఆత్మ కథ
-పి.జ్యోతి
కర్ణాటక జానపద అకాడేమీకి అధ్యక్షురాలిగా నియమించబడ్డ తొలి ట్రాన్స్జెండర్ మహిళ మంజెమ్మ ఆత్మకథ యొక్క తెలుగు అనువాదం ఇది. డా. చంద్రప్ప సోబటి దీన్ని కన్నడలో రాస్తే, రంగనాధ రామచంద్రరావు గారు దీని తెలుగులోకి అనువాదించారు. ట్రాన్స్జెండర్ల జీవితాన్ని సానుభూతితో అర్ధం చెసుకునే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో రావడం మంచి పరిణామం. తమ ప్రమేయం లేకుండా తమ శరీరం తో మనసు కలవలేక, తాము మరొకరి శరీరంలో బందీలమయి ఉన్నామనే భావంతో విపరీతమైన వ్యథతో గడిపే జీవితాలు వారివి. మంజమ్మ కూడా కర్ణాటకలో బళ్ళారి జిల్లాలో ఒక అతి పేద కుటుంబంలో మంజునాధ అనే అబ్బాయిగా పుట్టింది. ఈమె తల్లి తండ్రులులకు ఇరవై ఒక్క మంది సంతానం. అందులో ట్రిప్లెట్స్ కూడా ఉన్నారట. అయితే పదిహేడు మంది పిల్లలు ఆ తల్లి కళ్ళ ముందే మరణించి కేవలం ఐదు మంది మాత్రమే బ్రతికారు. బాల్యవయసు దాటిన తరువాత మంజునాధకు తన శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడం మొదలెట్టాయి. తాను అమ్మాయిననే భావం, అలా ఉండాలనే తపన ఎక్కువవుతుంటే తానున్నది పురుష శరీరంలో అన్న నిజం బాధకు గురి చేసేది. ఈ ద్వంద్వం తో చాలా అయోమయ పరిస్థితులలో ఆమె జీవితం గడిచింది. తరువాత అమ్మాయిగా ప్రవర్తిస్తున్నాడని తట్టుకోలేక కుటుంబంలో వ్యక్తులే ఆమెను విపరీతంగా కోట్టేవారు. ఆమె మేమమాన గాంధీ కూడా అలంటీ కారణాలతోనే జోగమ్మ గా మారాడు. కాని అతను కూడా మంజునాధ విషయంలో సానుభూతి చూపకుండా కొట్టి ఆ ఆడ లక్షణాలను మార్చాలనీ ప్రయత్నించాడు.
తల్లి పడే బాధ మంజునాధ చూడలేక, పురుషుడిగా ఉండలేక, తాను అశక్తుడిని అని కుటుంబీకులను నమ్మించలేక చాలా నలిగిపోయాడు. చివరకు అతన్ని జోగినీ గా మార్చడానికి కుటుంబం ఒప్పుకుంటుంది. పూజారులే ఆమెను జోగినిగా మార్చే తంతు నిర్వర్తించారట. ఆ తంతు తర్వాత తన తాళి తానే కట్టుకుని తాను దైవానికి అర్పించబడ్డ స్త్రీని అని జోగినీని అని ప్రకటించుకున్నాడు మంజునాధ. ఇలా ఆ తంతు నిర్వహించడం ఆ రోజులలోని సాంప్రదాయం. ఇప్పుడు పూజారులు జోగినీలను మార్చే ఘట్టం నిర్వహించట్లేదని చెప్పుకొస్తారు మంజమ్మ. చివరకు మంజునాధ మంజమ్మ గా స్థిరపడతాడు. జోగమ్మ గా మారిన తరువాత తప్పు పద్దతిలో జీవించకూడదని, తనకు తాను దేవతకు సమర్పించుకున్నందువల్ల నీతిగా ప్రద్దతిగా బ్రతకాలనే నియమాన్నే ఆమె ఎప్పుడూ పాటించారు. జీవించడానికి భిక్షాటన చెసుకోవడం జోగమ్మలకు తప్పు కాదు. ఇంట ప్రేమ దొరకక అందరి మధ్య ఒంటరిగా ఉండలేక మంజమ్మ ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. కుటుంబీకుల నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక ఆమె ఒక సారి ఆత్మహత్యా యత్నం చేసారు. అయితే కుటుంబం ఆసుపత్రీలో చేర్పించి ఆమెను బ్రతికించినా, ఆమె ఆ ఆసుపత్రిలో రోగుల మధ్య నాట్యం చెసి డబ్బు సంపాదించుకుంటూ కొన్ని నెలలు గడిపారు. తరువాత ఇల్లు వదిలి కొందరి దయా సానుభూతులతో స్వతంత్రంగా జీవించడం మొదలెట్టారు. దేవస్థానం బండలను తుడిచి కొన్నాళ్ళూ, భిక్షాటన చేసుకుంటూ కొన్నాళ్ళూ జీవించారు. అతి దీనావస్థలో జీవిస్తున్న క్రమంలో ఒక చిన్న పిల్లవాడు జోగినీ నృత్యం చేయడం చూసి ఆ పిల్లవాని గురువును ఆశ్రయించి తాను కూడా ఆ నృత్యం నేర్చుకుంటానని అడుగుతుంది మంజమ్మ. బసప్ప అనే ఆ వ్యక్తి ఆమె కోరికను మన్నించి ఆమెకు ఆ నృత్యం నేర్పించాడు. పొట్ట కూటీ కోసం ఆ నృత్యం నేర్చుకున్న మంజమ్మ బసప్ప వద్ద చాలా అవమానాలను కష్టాలను చవి చూసింది. కాని ఇప్పటికీ అతన్ని తన గురువుగానే గౌరవంగా తలుచుకుంటూ ఉంటుంది. ఆయనే లేకపోతే తాను ఒక సాధారణ జోగినీగా అవమానాలు పడుతూ చీత్కారాలను అనుభవిస్తూ జీవించి ఉండేదాన్నని. ఇప్పుడు ఒక జానపద కళాకారిణిగా తాను అనుభవిస్తున్న వైభవం, పేరు ఆయన పెట్టిన భిక్ష అని బసప్పను గౌరవిస్తుంది మంజమ్మ.
అలాంటి రోజులలోనే ఒక సారి అత్యాచార యత్నానికి తాను గురవడం గురించి ఆమె చెప్తారు. ఆ అవమానాన్ని దిగమ్రింగుకుని కొన్ని రోజులు ఇడ్లీలు అమ్ముకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ తాను బ్రతికే ప్రయత్నం చేసానని చెప్పుకున్నారు. కాళవ్వ అనే మరో జోగినీ సహాయంతో నటన ను వృత్తిగా మలచుకున్నారు. ఆ కాళవ్వనే ఆమె చివరి దాకా తన తల్లిలా గౌరవించారు. మామూలు నాట్యకత్తెగా మిగిలిపోవలసిన మంజమ్మను కాళవ్వ ఒక కళాకారిణీ గా తీర్చిదిద్దారు. మగజోగమ్మల నాటక బృందాన్ని ఏర్పరచి కర్ణాటకలోనే విశిష్టమైన పేరు సంపాదించారు. యెల్లమ్మ, పరుశురాముడు భస్మాసుర పాత్రలను పోషించి కన్నడ జానపద రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. కొన్నాళ్ళు కాలవ్వతో మనస్పర్ధలు ఏర్పడినా ఎక్కువ రోజులు వారికి దూరంగా ఉండలేక మళ్ళీ తిరిగి వచ్చి ఎన్నో నాటక ప్రదర్శనలు కలిసి ఇచ్చారు.
మగ జోగినీ ల అనుభవాలు చెబుతూ మరణించిన తరువాత ఈ జీగినీల దహన సంస్కారాల దగ్గర అయ్యే గొడవలు గురుంచి చెబుతూ, ఇద్దరు మగజోగినీల మరణానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. కుటుంబీకులు వీరిని దూరం పెట్టి, వెలి వేసినా వారికి సంబంధించిన ధన వస్తువుల విషయంలో మాత్రం చూపే వారు చూపే ఆశ, సమాజం వీరి కళను ఆనందించినా వారికి సముచిత గౌరవం ఇవ్వకపోవడం, వీటి వెనుక సమాజంలో జోగమ్మలపై నున్న చులకన భావం కనిపిస్తూ ఉంటుందని, తమను మనుష్యులుగా గుర్తించవలసిన అవసరం ఉందని అదే తమకు సమాజం ఇచ్చే రక్షణ అవుతుందని స్పష్టంగా రాసుకున్నారు మంజమ్మ. కళాకారులకు పెన్షెన్ ఇచ్చే వయసును తగ్గించాలని పేద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలను పోరాటం చేస్తున్నారు మంజమ్మ. జోగినీ నృత్యాన్ని మరి కొందరికి నేర్పించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఆ ప్రాచీన కళ అంతరించకూడదని తపన పడుతున్నారు ఆమె. ఆమె ప్రతిభకు, జానపద కళలకు ఆమె చేస్తున్న సేవకు మెచ్చి కర్ణాటక ప్రభుత్వం ఆమెను ఎన్నో బిరుదులతో సన్మానించింది.
ట్రాన్జెండర్ గా సమాజపు చీత్కారాల మధ్య పెరిగి, జీవించి కటిక పేదరికాన్ని క్రూరమైన వివక్షను అనుభవించిన మంజమ్మ నేడు సంపాదించుకున్న గౌరవం ఆమె పట్టుదలకు, కష్టాలకు బెదరని దృఢ చిత్తానికి నిదర్శనం. ఎప్పుడు తన లాభం కోసం కాకుండా సమూహంగా జోగినీలందరి క్షేమం ఆశించి జీవిస్తున్న మంజమ్మ నిజంగా గొప్ప మానవతావాది. దుర్బర పరిస్థితులలో కూడా మనిషిగా సమాజం గుర్తించని పరిస్థితులలో కూడా ఒక మానవిగా ఎదగగలిగిన ధీర ఆమె. సంఘసేవకురాలిగా ఆమె జీవిస్తున్న విధానం ప్రశంసనీయం. చీత్కరించుకున్న సమాజం మధ్యనే జీవిస్తూ ఆత్మవిశ్వాసంతో ఎదుగుతూ చివరికి వారందరి చేత సన్మానాలు పొందిన ఆమె అపురూప వ్యక్తిత్వం మనిషిగా పుట్టిన అందరికీ స్పూర్తిదాయకం. మంజమ్మ జోగతిగారిని కర్ణాటక జానపద విశ్వవిద్యాలయం ప్రతి నెల జరిగే విశిష్ట కార్యక్రమమైన ‘పట్టాంగ” కార్యక్రమానికి ఒక నెల అతిధిగా ఆహ్వానించి, వారి చేత చెప్పించిన ఆత్మ కథ ఇది. కన్నడలో ఇది ప్రచురితమయిన తరువాత తెలుగులోకి అనువదించబడింది.
పుస్తకంగా ఇది గొప్ప రచన అనలేం. కాని మనకేమాత్రం అవగాహన లేని జోగినీ సాంప్రదాయాన్ని పరిచయం చెస్తూ ఆ సాంప్రదాయం మాటున ఎందరు ట్రాన్జెండర్లు సెదతీరారో, తమ జీవితాలను గడిపారో, ఆ సాంప్రదాయంలోనే ఉంటూ గొప్ప కళాకారులుగా ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుకున్నారో మనకు తెలియజేసే మంచి జీవిత కథగా దీన్ని తప్పక చదవాలి. కేవలం 100 పేజీల ఈ రచన ఇచ్చే అనుభవం అపారం.
హిందీలో పీ.ఎచ్.డీ చేసారు. రైల్వే జూనియర్ కాలేజీలో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. స్ప్రెడింగ్ లైట్ పేరుతో తార్నాకలో బుక్ క్లబ్ నడుపుతున్నారు. దాదాపు 1000 పుస్తక సమీక్షలు, 1500 సినిమా సమీక్షలు రాసారు.