నడక దారిలో-2

-శీలా సుభద్రా దేవి

“నాన్న మీద కవితలు మీరు రాసిన వేమైనా ఉన్నాయా” అని “నాన్న పదం” సంకలనం కోసం ఘంటశాల నిర్మల గారు అడుగుతే ‘లేవు ‘అన్నప్పుడు ‘ఏదైనా రాయండి’ అన్నారు
      ఒక్క జ్ణాపకాన్ని నాకు ఇవ్వని నాన్నగురించి ఏమి రాస్తాను.
నాకు ఊహ తెలిసే సరికే జబ్బు తో ఉన్నారు.అమ్మ వంటి మీద నగలతో సహా అంతా కరిగి పోయింది.మరీమరీ మెదడు మడతలని విప్పగా ఆదివారాలు త్రినాధ స్వామి వ్రతం చేసేవారు అన్నది గుర్తువచ్చింది.వీధివరండాలో వెడల్పు బల్ల మీద కూర్చుని ” లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే” అంటూ గజేంద్ర మోక్షం పద్యాలు చదివిన గుర్తు ఛాయా మాత్రం గా కదిలింది.
    గాలి మార్పు ఉంటే ఆరోగ్యం కుదుట పడుతుందేమో నాన్నగారిని అక్కయ్య ఇంటికి అనకాపల్లి కి తీసుకు వెళ్ళినా లాభం లేక జబ్బు తిరగబెడితే రాత్రికి రాత్రే విజయనగరం వచ్చేసి పెద్ద మామయ్య  ఇంటికి తెచ్చారు.
  చీకటి పడుతున్నవేళ నేను లోపల గదిలో చందమామ కథల్లో రెక్కలు గుర్రం మీద స్వారీ చేస్తూ సప్తసముద్రాలు దాటి కథల కడలిలో మునుగీతలు కొడుతుంటే “‘చిన్నది ఏదీ “అంటూ పుస్తకంతో పాటే చెయ్యిపట్టి ఎవరో  నన్ను లాక్కొచ్చి అమ్మ పక్కన కూలేసారు.అంతవరకూ గట్టిగా గురక పెట్టి ఆగిన నాన్నగారి నిశ్చల దేహాన్ని చూస్తున్న నన్ను  అమ్మ ‘ వెళ్ళు చిన్నా చదువుకో’ అని లోపలికి పంపించేసింది.ఇంతే నా జ్ణాపకం.
  ఏడుగురు అన్నదమ్ముల మధ్య పుట్టినదీ అందరిచేతా రాజూ,రాజమ్మా అని పిలిపించుకున్న అమ్మ తీవ్ర ఆర్థిక సంక్షోభం లో జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. నలుగురు పిల్లలతో నిస్సహాయంగా నిలిచింది. అమ్మ ఆ తదనంతరం జీవితం లో ఎదుర్కొన్న వివక్షలూ,అవమానాలూ, ఇబ్బందులూ వీటన్నటి మధ్యలో కూడా నిబ్బరం గా ఉండేది.ప్రభుత్వ ఉద్యోగం లో ఉండగా నాన్న  చనిపోయినా ఫేమిలీ పెన్షన్ అమ్మకి వచ్చే ఏర్పాటుఎవరూచేయలేదు.బహుశా ఆమెకు ఆర్ధిక తోడ్పాటు కలుగుతే తాము ఆమెపై పెత్తనం చెలాయించి అణగదొక్కటానికి కుదరదనే పెన్షన్ రాకుండా చేసారేమో. 
     నాన్నగారి వాటా పొలం మీద కౌలు చేస్తున్న వాళ్ళు ఏడాదికో ఎప్పడో దయాదాక్షిణ్యం గా పంపే  ధాన్యం బస్తాలు ఒక ఎనిమిదో పదో వచ్చేవి, నాలుగైదు కుంచాల పెసరపప్పు  వచ్చేది.ధాన్యం పట్టటానికి మిల్లరు డబ్బు బదులు,చిట్టూ,తౌడూ తీసుకునేవాడు.అమ్మ బియ్యం జల్లించగా వచ్చిన నూకలు ఇచ్చి కూరలవి కొనేది.  ఉంటే తినటం,లేకుంటే పిల్లలకు పెట్టి  పస్తులు ఉండటమే తప్పా  ఎప్పుడూ ఎవరినీ నయాపైసా అడగకుండా,లేదు అనే మాట నోట రాకుండా జీవితం గడిపింది.మమ్మల్నీ అలాగే పెంచింది.పుట్టినరోజున ఇంట్లో ఉన్న బియ్యం తోనే పరమాన్నం వండి పెట్టేది.
     మా పెద్దన్నయ్యకి శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి లో ఉపాధ్యాయ ఉద్యోగం రాగానే అందరం అక్కడికి వెళ్ళిపోయాము.అక్కడా అదే గుట్టుగా సాగే జీవితమే.
      ఏడోతరగతిలోనే నేను రజస్వలనౌతే బట్టలకూ, వేడుకలకు డబ్బు అడిగి  కొడుకు చేత కూడా ఖర్చు పెట్టించటం ఇష్టంలేక  ఎవరికీ తెలియనీయలేదు.ఆ విధంగా సుమారు రెండేళ్ళపాటు దాచింది.అదృష్టమో,దురదృష్టమో నేను బలహీనంగా చిన్నగా ఉండేదాన్ని.నా మైలబట్టలను తానే బహిష్టు అయినట్టు గా ఉతికింది.నావే కాదు తర్వాత తర్వాత కోడళ్ళ పురుళ్ళకి కూడా  వాళ్ళ ముట్టు గుడ్డలు కూడా ఉతికినా కూడా అవాకులు చవాకులు అందుకుని మౌనం వహించిన  ప్రేమమూర్తి.
     పురుడు పోయటానికి కూతురు ఇంటికి వచ్చినందుకు ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు ” మా అమ్మ అయితే ఇలా కూతురు ఇంటికి వచ్చి పురుళ్ళు పోయదు” అని వెటకారంగా మాట్లాడినా కూతురు జీవితాన్ని దృష్టి లో పెట్టుకొని  నోరెత్తని సహనమూర్తి.
      రెండో మనవరాలు పుట్టాక నామకానికి పదకొండో రోజు చీర ఉయ్యాల కట్టి పాపాయిని అందులో పడుకో బెట్టి  అక్షింతలు వేయమంటే వేస్తూ” మేము లైన్లం( lions) మాకు ఆడపిల్లలు పుట్టర”ని మీసాలు మెలేసి  అంటున్న ఇంట్లో వాళ్ళని నిరసన చూస్తూ మౌనం వహించి, నెలలోపునే పిల్లలతో సహా నన్ను తీసుకుని విజయనగరం  వచ్చేసింది.దురదృష్ట వశత్తూ అర్భకంగా పుట్టిన పిల్ల డయేరియా తో మూసిన కన్ను మరి తెరవకపోతే ఆడపిల్లని నిరసనగా చూసే ప్రపంచంలో ఉండలేక పోయిందని,ఆ దుర్ఘటన తన ఇంట్లో ఉండగా జరిగినందుకు కన్నుతెరవని పాపాయికి మట్టి దుప్పటి కప్పి నన్ను అక్కున చేర్చుకుని కుంగిపోయింది.
      నా డెలివరీ లో కోసం హాస్పిటల్ లో ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ఆయాలను చూస్తూ ఇంట్లో ఐనా చేసేది ఇదే పని కదా ఈ పని దొరికినా బాగుణ్ణు.ఎవరిమీదా ఆధారపడకుండా బతకొచ్చు’అనేది.మొదటి నుండి అమ్మకి ఆర్థిక స్వావలంబన లేక పోవటం వలనే ఇన్ని అవస్థలు పడింది అనేది నాకు మనసులో నాటుకు పోయింది.స్త్రీ ఎంతో కొంత సంపాదించి గలిగే విద్యార్హతలు పొంది ఉండాలి.ఆర్థిక స్వావలంబన వలన స్త్రీ కి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది అని నా నమ్మకం.అందుకే ఉద్యోగం చేయాలని నేను ఆరాటపడ్డాను.కాని ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లలూ, రోగాలూ రొష్టులూ మరో పదేళ్ళు కు గానీ ఉద్యోగం చేసే వెసులుబాటు కలగలేదు.టీచర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు చదువు అశ్రద్ధ చేసే ఆడపిల్లలకు “ఎప్పుడేం అవసరం వచ్చినా చిన్న ఉద్యోగం కావాలన్నా పదోతరగతి పాసవ్వటం ముఖ్యం”అని చెప్తూ ఉండేదాన్ని.
     అమ్మ 75 ఏళ్ళు ఏరోజూ విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూ చేస్తూనే కుప్ప కూలిపోయింది.మూడురోజులు గొట్టంద్వారా ద్రవపదార్థాలు అందుకుని నా ముందే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన అమ్మ నా జ్ణాపకాలలో నిరంతరం  చిరస్థాయిగానే ఉంటుంది .కన్న పిల్లల కోసం కొవ్వొత్తులలా కరిగే ఇటువంటి అమ్మలు ఎంతోమందికి ఉండే ఉండొచ్చు కదా. కానీ కొవ్వొత్తి కరిగిపోయినా అది నింపిన వెలుగు పిల్లలగుండెల్లో నిత్యం కాంతులీనుతూనే ఉండాలి.

*****

Please follow and like us:

2 thoughts on “నడక దారిలో(భాగం-2)”

  1. Your memories in terms of your sufferings due to economic issues are heart touching n the character of your Mom is really great👍

    1. మీ స్పందన కు ధన్యవాదాలు జ్యోతి రాణి గారు

Leave a Reply

Your email address will not be published.