షర్మిలాం “తరంగం” కనబడని శత్రువుతో పోరాటం ! -షర్మిల కోనేరు ఈ బంధాలు శాశ్వతం కాదు అని చెప్తుంది వేదాంతం. ” రాక తప్పదు పోక తప్పదు ” అని అనుకుంటాం నిర్వేదంగా ! జగం అనే రంగస్థలం పైన మనం పాత్రధారులం అని కూడా అంటాం … కానీ ఈ రాక కి పోక కి మధ్య జరిగేవి ఉత్తి సన్నివేశాలేనా ? నాటకంలో నటిస్తాం జగన్నాటకంలో జీవిస్తాం! నటించడం అయిపోగానే పాత్రధారి నిష్క్రమిస్తే ఆ పాత్ర ముగిసినట్టే, కానీ జీవితంలో అలా కాదు ఆ మనిషి తోపెనవేసుకున్న ఎన్నో జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. నడి సముద్రంలో జారవిడిచి నావ తీరానికి జేరిపోతే ఒడ్డెక్కడం ఎంత కష్టం! ఇప్పుడు ఈ కరోనా చేసే కరాళ నృత్యంలో పిల్లలకు తలులు , కొందరు పిల్లలకు తండ్రులు దూరం అవుతున్నారు. భర్తను పోగొట్టుకున్న భార్యలు … భార్యలకు దూరమైన భర్తలు ఇంటరై బేలగా ఈ సంసారాన్ని తోడు లేకుండా ఎలాఈదాలో తెలియక తల్లడిల్లుతున్నారు . వృద్ధ తల్లి తండ్రులకు తీరని శోకం మిగులుతోంది. ఇవన్నీ చూస్తూ ఇంకెన్ని చూడాలో తెల్యక గుండెలు చిక్కబట్టుకుని బతుకుతోంది భారత దేశం . రాజకీయ ఎత్తుగడల్లో మునిగితేలడం తప్ప ప్రజలి రక్షించే వ్యూహరచన లేని నాయకత్వాన్ని నిందించాలో తమ ఖర్మకిఏడ్వాలో తెలియని జనం శ్మశానాల దగ్గర బారులు తీరుతున్నారు. ఇదంతా మిధ్య అని చెప్పే వేదాంతం మాకొద్దు. జీవితం బుద్భుదప్రాయం కాదు. ఆలింగనాలు , అలకలు, కోపతాపాలు , ఆవేశ కావేషాలు ప్రేమలు , బాధ్యతలు ఇంకెన్నెన్నో రంగుల సమ్మేళనం. ఒక క్రిమి గాని క్రిమి పడగ విప్పి జనాల్ని కాటేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాత . ఆప్తుల్ని పోగొట్టుకున్న వారిని వాటేసుకుని ఓదార్చడానికి సాటి మనుషులు సాహసించలేని పాడు కాలం దాపురించింది . కానీ మనిషి ఏనాటికైనా జయిస్తాడు. అంతవరకూ కరోనాతో జరిగే ఈ యుద్ధంలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం . అస్త్రం దొరికే వరకూ మనని మనం కాడుకుంటూ బాధితులకు బాసటగా నిలవడమే అందాకా మనం చేయాల్సిన పని ! ***** షర్మిల కోనేరుషర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో […]
Continue Reading