ప్రేమ (కవిత)
ప్రేమ -డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రేమంటే ఏమిటి? అడిగిందో ప్రేయసిగా ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం – చెప్పాడతడు తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె ఏదైనా చేయగలగడమంటే కోట్లు వెచ్చించి కొనుక్కోగలగడం తత్వబోధ చేసి తాపీగా వెళ్ళిపోయాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో భార్యగా బాధ్యతగా బ్రతకడమే- బదులిచ్చాడతడు విరామమే మరిచి అతడి విలాసానికి వెలుగై నిలిచిందామె కళాత్మకత తెలియని కఠిన శిలవంటూ సరస సల్లాపాల డోలలాడించగల మోహిని ముందు మోకరిల్లాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో తల్లిగా రక్త మాంసాలను ధారపోయడమే- బదులిచ్చాడతడు జీవితాన్నే ధారపోసిందామె రెక్కలొచ్చిన పక్షి తన గూటిని వెతుక్కుంది మీలో ఎవరైనా నన్ను ప్రేమించగలరా? అడిగిందామె అది అన్ కండీషనల్ ప్రేమించడమే నీ వంతు సమాధానమిచ్చారు ముగ్గురూ! **** డా. నల్లపనేని విజయలక్ష్మి.డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వీరి కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
Continue Reading